Iran : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ఇరాన్ తన దూకుడును పెంచింది. తాజాగా భారత్‌కు వస్తున్న ‘ఎపామినోండెస్’ (Epaminondas) అనే కంటైనర్ నౌకను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలవంతంగా తన అదుపులోకి తీసుకుంది. హర్మూజ్ జలసంధిలో జరిగిన ఈ పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఈ నౌకలో భారతీయులు చిక్కుకుపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
హైడ్రామా మధ్య నౌక ( Iran ) స్వాధీనం..
సౌదీ అరేబియా నుంచి బయలుదేరిన ‘ఎపామినోండెస్’ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో భారత్‌తో పాటు ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్, శ్రీలంక దేశాలకు చెందిన మొత్తం 21 మంది సిబ్బంది ఉన్నారు. గత కొన్ని రోజులుగా హర్మూజ్ (Iran) జలసంధి దాటేందుకు క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్న ఈ నౌక, శుక్రవారం జలసంధిలోకి ప్రవేశించగానే ఇరాన్ గార్డ్స్ మెరుపు దాడి చేశారు. నౌకను చుట్టుముట్టిన అధికారులు కాల్పులు జరిపి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం.

21 మంది (Iran) బందీ..
ఈ నౌకలో వైస్ కెప్టెన్‌గా పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన సంజయ్ మహర్ (38) పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారు 15 ఏళ్లుగా మర్చంట్ నేవీలో సేవలందిస్తున్న సంజయ్, కేవలం 20 రోజుల క్రితమే విధుల్లో చేరడానికి ఇంటి నుంచి వెళ్లారు. ఇరాన్ దళాలు నౌకను స్వాధీనం చేసుకున్న తర్వాత సంజయ్ తన కుటుంబంతో మాట్లాడి, ప్రస్తుతానికి తామంతా క్షేమంగా ఉన్నామని, కాల్పుల సమయంలో సురక్షిత ప్రదేశంలో తలదాచుకున్నామని వివరించారు. అయినప్పటికీ, ఇరాన్ దళాల అదుపులో ఉండటం వారిని భయాందోళనలకు గురిచేస్తోంది.
Read Also : BRS : కవిత పార్టీపై బీఆర్ఎస్ ఘాటు కౌంటర్.. డూప్లికేట్లను చూసి ప్రజలు మోసపోరు.!
కుటుంబ సభ్యుల (Iran) ఆర్తనాదం..
మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న సంజయ్ తండ్రి ఓం ప్రకాశ్ మహర్ కన్నీరుమున్నీరవుతున్నారు. “మా అబ్బాయి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానని చెప్పాడు, కానీ ఇరాన్ దళాల మధ్య వాడు ఎప్పుడు తిరిగొస్తాడోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా బిడ్డను, నౌకలోని ఇతర భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలి” అని ఆయన వేడుకుంటున్నారు. సంజయ్ కుటుంబం ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే జైదీప్ బిహానీని కలిసి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి , ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
Read Also : Lucky Zodiac Signs : మే 14 నుండి ‘గజలక్ష్మీ రాజయోగం’.. ఈ రాశుల వారి ఇంట కనక వర్షమే.!
అంతర్జాతీయ జలాల్లో అస్థిరత
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ఇరాన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం అంతర్జాతీయ రవాణా వ్యవస్థకు పెను సవాలుగా మారింది. గతంలో కూడా ఇరాన్ పలు నౌకలను స్వాధీనం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరిపి, మన పౌరులను వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు దౌత్యపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి.














