Deepam scheme: గ్యాస్ సరఫరా సమస్యలు, ధరల పెరుగుదల, అంతర్జాతీయ పరిస్థితులు అన్నీ కలిసి ఇప్పుడు సామాన్య ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని భారీగా పెంచాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా దీపం పథకం లబ్దిదారులను పీఎన్జీ వైపు మళ్లించేందుకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నా కూడా దీపం పథకం ద్వారా లభించే రాయితీ సొమ్ము కొనసాగుతుందని సీఎం ప్రకటించడం. అంటే గ్యాస్ మారినా, లబ్ధి మాత్రం అలాగే ఉంటుందన్న మాట. ఈ నిర్ణయం సాధారణంగా కనిపించినా, దీని ప్రభావం పెద్దది. గ్యాస్ సరఫరా సమస్యలను తగ్గించడమే కాకుండా, భవిష్యత్తులో స్థిరమైన వ్యవస్థను ఏర్పరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలుస్తోంది.
10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు.. 6 నెలల్లో టార్గెట్ పూర్తి చేయాలి
గ్యాస్ సరఫరా పరిస్థితులపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం స్పష్టమైన టార్గెట్ పెట్టారు. వచ్చే 6 నెలల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని ఆయిల్ కంపెనీలకు ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి ఆలస్యం సహించబోమని, టార్గెట్ తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం, గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్ సరఫరాలో ఇప్పటికే కొంతవరకు సమస్యలను అధిగమించినట్లు తెలుస్తోంది. డొమస్టిక్ పంపిణీపై ఒత్తిడి తగ్గిందని, త్వరలో పూర్తిగా సాధారణ స్థితికి తీసుకువస్తామని తెలిపారు. పీఎన్జీ వినియోగం పెరగడం వల్ల ఎల్పీజీపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని, దీర్ఘకాలంలో ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: https://www.telugunews.co/telangana-heatwave-health-advisory-imd-warning/
పైప్లైన్ పనులపై సీఎం ఫోన్.. కేంద్రానికి స్పష్టమైన సందేశం
ఈ సమీక్షలో మరో కీలక అంశం కూడా బయటపడింది. శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు నేచురల్ గ్యాస్ పైప్లైన్ పనుల్లో జాప్యం జరుగుతోందని సీఎం ప్రశ్నించారు. దీనిపై అధికారులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పడంతో, సీఎం అక్కడికక్కడే కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫోన్ చేశారు.
టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, వెంటనే పనులు వేగవంతం చేయాలని సీఎం కోరారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పరిణామంతో పైప్లైన్ పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గ్యాస్ సమస్యలు పెరుగుతున్న సమయంలో.. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు కీలకంగా మారాయి. దీనితో పీఎన్జీ కనెక్షన్ పెరుగుదల, సరఫరా సమస్య తగ్గుముఖం, లబ్దిదారులకు నష్టం లేకుండా చూడడం.. మొత్తానికి, గ్యాస్ రంగంలో పెద్ద మార్పుకు ఇది ప్రారంభం కావచ్చు.














