Sharmila-Roja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో YSR పేరు ఎప్పుడూ సెంటర్‌లోనే ఉంటుంది. సంక్షేమం, అభివృద్ధి, రైతు పథకాలు.. ఏదైనా చర్చ మొదలైతే చివరకు YSR పాలనకు పోలికలు రావడం సహజం. ఇప్పుడు కూడా అదే జరిగింది. YSR పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా షర్మిల చేసిన ట్వీట్ మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్రను ఆమె గుర్తుచేసుకుంటూ, ఆ ప్రయాణం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిందని పేర్కొన్నారు.
ఆమె ట్వీట్‌లో YSR సంక్షేమ పాలనను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఆయన అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయని చెప్పారు. ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం వంటి పథకాలను గుర్తుచేస్తూ, అవి ఒక చరిత్రగా నిలిచాయని వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడే ట్వీట్ టోన్ మారింది. YSR ఆశయాలకు నిజమైన వారసత్వం కాంగ్రెస్ పార్టీకే ఉందని, ఆ ఆశయాలను తిరిగి తీసుకురావాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆమె పేర్కొన్నారు. ఇదే రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది.
ఇక ముఖ్యంగా వైఎస్ జగన్‌పై చేసిన విమర్శలు మరింతగా దృష్టిని ఆకర్షించాయి. YSR పేరు వాడుకున్నారే తప్ప, ఆయన ఆశయాలకు నిజమైన వారసులు కాలేదని ఆమె పేర్కొన్నారు. కొన్ని విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ, పాలనపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. YSR వారసత్వంపై ఎవరికీ హక్కు అన్న ప్రశ్న మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
రోజా కౌంటర్..
షర్మిల ట్వీట్‌కు ఎక్కువ సమయం పట్టలేదు.. వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చేశారు. ఆమె ట్వీట్ తో ఈ వివాదం మరింతగా వేడెక్కింది. రోజా తన ట్వీట్‌లో నేరుగా షర్మిలను టార్గెట్ చేస్తూ, “కూటమి పార్టీలకు దత్త పుత్రికగా మారిన మీరు మా నాయకుడిపై మాట్లాడే అర్హత ఉందా?” అంటూ ప్రశ్నించారు. ఈ ఒక్క లైన్‌తోనే రాజకీయ టోన్ పూర్తిగా మారిపోయింది. అంతేకాకుండా, YSRకు వ్యతిరేకంగా ఉన్న వారితో చేతులు కలిపింది ఎవరో ప్రజలకు తెలుసని ఆమె పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమి రాజకీయాలు ఎలా ఉన్నాయో, రాష్ట్రంలో ఎందుకు వేరే విధంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఇక్కడే ఆమె కీలకంగా ఒక పాయింట్ చెప్పారు.. “YSRకు నిజమైన వారసుడు జగన్‌నే అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారు” అని స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక కౌంటర్ మాత్రమే కాదు, YSR వారసత్వంపై వైసీపీ స్టాండ్, అలాగే రాజకీయంగా తమ స్థానాన్ని బలపరచే ప్రయత్నంగా ఆమె చెప్పుకుంటూ వచ్చారు. ఈ ట్వీట్ వార్‌తో ఒక విషయం క్లియర్ అయింది.. YSR పేరు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ ప్రభావం చూపుతోంది. ఇద్దరు నాయకులు కూడా YSR వారసత్వాన్ని తమ వైపు చూపించడానికి ప్రయత్నించడం, ఆ పేరు ఎంత బలంగా ఉందో చూపిస్తోంది.
Also Read: https://www.telugunews.co/atchannaidu-tweet-paddy-payment-24-hours-ap/
ఒక పాత పాదయాత్ర జ్ఞాపకం.. ఒక ట్వీట్.. ఒక కౌంటర్.. ఇవి కలిసి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. YSR వారసత్వం ఎవరిది? అన్న ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. దానికి సమాధానం మాత్రం చివరికి ప్రజలే చెప్పాల్సి ఉంటుంది.













