Heatwave alert: వాతావరణం ఒక్కసారిగా తీవ్రంగా మారుతోంది. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా ఆరోగ్య సూచనలు విడుదలయ్యాయి. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ తాజాగా విడుదల చేసిన అడ్వైజరీలో, హీట్‌వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయట తిరగడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రజలకు కీలక సూచనలు.. ఇవి పాటిస్తేనే సురక్షితం
వేడి తీవ్రత పెరిగే సమయంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం. రోజంతా తగినంత నీరు తాగాలి. దాహం లేకపోయినా కూడా నీరు తాగడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ORS ద్రావణం, నిమ్మరసం, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయి సమతుల్యంగా ఉంటుంది. ఇవి వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినడం మంచిది. తరబూజ, ఖర్బూజ, ద్రాక్ష, దోసకాయ వంటి వాటి వినియోగం శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.
బయటకు వెళ్తే తప్పనిసరిగా జాగ్రత్తలు
బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తల కవర్ చేసుకోవడం తప్పనిసరి. టోపీ, గుడ్డ లేదా అంబ్రెల్లా వాడటం మంచిది. అలాగే తేలికపాటి, కాటన్ దుస్తులు ధరించడం వల్ల వేడి ప్రభావం తగ్గుతుంది. పాదరక్షలు లేకుండా బయట తిరగకూడదు. నేల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల కాలిన గాయాలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయట తిరగకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇంట్లో కూడా జాగ్రత్తలు అవసరం
వేడి సమయంలో ఇంట్లో ఉండడం ఉత్తమం. గాలి సరిగా వచ్చేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు ఉదయం మూసి, రాత్రి సమయంలో తెరిచి ఉంచడం వల్ల చల్లని గాలి లోపలికి వస్తుంది. కిచెన్‌లో పని చేసే సమయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎక్కువ వేడి సమయంలో వంట చేయడం తగ్గించడం మంచిది.
Also Read: https://www.telugunews.co/telangana-paddy-procurement-rabi-season-payment-2-days/
హీట్‌వేవ్ ప్రభావం వల్ల కొన్ని ప్రమాదకర లక్షణాలు కనిపించవచ్చు
తలనొప్పి
వాంతులు
చర్మం ఎర్రబడటం
శరీర ఉష్ణోగ్రత 40°Cకి పైగా ఉండటం
గుండె వేగంగా కొట్టుకోవడం
తల తిరగడం, మూర్ఛ
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రభుత్వ ఏర్పాట్లు.. సిద్ధంగా వైద్య వ్యవస్థ
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు కూడా ప్రజలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ORS సాచెట్లు కూడా అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాబోయే మూడు రోజులు కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో చిన్న జాగ్రత్త కూడా పెద్ద ప్రమాదాన్ని . నివారించగలదుకాబట్టి.. హీట్‌వేవ్ హెచ్చరికలను తేలికగా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఈ ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా ఉంటుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. మరి మీరు తస్మాత్ జాగ్రత్త!













